సమాజాన్ని మాదకద్రవ్యాల బారినుంచి కాపాడటం, నేరాలను నియంత్రించడం, యువతను గంజాయి వంటి మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడం లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు పుల్లలచెరువు తండాలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో అనుమానాస్పద ప్రాంతాలు, వాహనాలు, వ్యక్తుల కదలికలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఆపరేషన్‌లో ఎటువంటి నిషేధిత పదార్థాలు లభించకపోయినా, ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించడం మరియు నేరాల నివారణ ప్రధాన ఉద్దేశ్యంగా చర్యలు చేపట్టారు. మొత్తం 12 వాహనాలను తనిఖీ చేయగా, పరిశీలన అనంతరం 11 వాహనాలను విడుదల చేశారు.CASO అనంతరం పోలీసులు స్థానిక ప్రజలతో కలిసి ‘డ్రగ్స్ వద్దు బ్రో’ ప్రతిజ్ఞ చేపట్టి మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ కట్టుబాటును చాటిచెప్పారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడితే వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. గంజాయి వినియోగం, రవాణా, విక్రయాలు చట్టరీత్యా తీవ్రమైన నేరాలని, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా ప్రజలకు NDPS చట్టం, రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రత, సైబర్ మోసాలు, నకిలీ లోన్ యాప్‌ల మోసాలు వంటి కీలక అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, వేగ నియంత్రణ వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మహిళలపై నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ అపరిచిత లింకులు క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. నకిలీ లోన్ యాప్‌ల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సమాజ భద్రతకు సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *