తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే ‘పల్లెనిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు* తెలిపారు.శుక్రవారం ఆయన సంతమాగులూరు మండలంలోని సజ్జాపురం గ్రామంలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారితో కలిసి గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యలను ఓపికగా విన్న కలెక్టర్, వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పొదుపు సంఘాల మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడి, గ్రూప్ రుణాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు.గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీవో జాన్సన్, జడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.