తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :-
ప్రజలకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా పార్కులు, చెరువుల గట్లు, ఖాళీ స్థలాలు, రహదారుల పక్కన ఉన్న ప్రాంతాలు మరియు ప్రజలు అధికంగా సంచరించే ప్రదేశాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ఓపెన్ బూజింగ్ స్పాట్లను గుర్తించి క్లీన్ చేస్తున్నారు.ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించే వ్యక్తులపై చర్యలు తీసుకుంటూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు భయాందోళనలు లేకుండా సంచరించే వాతావరణం కల్పించడంపై దృష్టి సారిస్తున్నారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అసభ్య ప్రవర్తన, ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.
